దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఐటీ, వాణిజ్య సముదాయాల గిరాకీలో దూసుకెళ్తున్న హైదరాబాద్ మరో ఘనతను సొంతం చేసుకున్నది. చిన్న ప్రాజెక్టులైనా, పెద్ద నిర్మాణాలైనా.. దేశంలోకెల్లా హైదరాబాద్‌లోనే త్వరగా పూర్తవుతాయని తేలింది. గత దశాబ్దకాలం నుంచి ఇదో ఘనమైన రికార్డు అని అనరాక్ సంస్థ తాజాగా విశ్లేషించింది. 2000 నుంచి 2019 దాకా హైదరాబాద్ నిర్మాణ రంగంలో చిన్న ప్రాజెక్టులు 4.4 ఏండ్లలో పూర్తయితే, బడా నిర్మాణాలు 5.4 ఏండ్లలో పూర్తయ్యాయి. ఇదే సమయంలో చెన్నైలో చిన్నవి 5.5 ఏండ్లలో పూర్తయితే, బడా ప్రాజెక్టులు 5.6 ఏండ్లు పట్టడం గమనార్హం. ఎన్‌సీఆర్ రీజియన్‌లో బడా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి బిల్డర్లు దాదాపు 7.2 ఏండ్లు తీసుకున్నారు.
మొత్తానికి దేశంలోని ఏడు నగరాల్లో 100 నుంచి 500 ఫ్లాట్లు గల చిన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 5.2 ఏండ్లు పడితే, పెద్ద ప్రాజెక్టుల పూర్తికి 6.5 ఏండ్లు పట్టింది. ‘హైదరాబాద్‌లో డెవలపర్లు ఎక్కువగా జాయింట్ డెవలప్‌మెంట్ మీద నిర్మాణాల్ని చేపడతారు. దీంతో స్థల యజమానులకు ఆయా భూమిపై ఎంత షేరు వస్తుందనే విషయం అర్థమవుతుంది’ అని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు. ఇలాంటి విధానం వల్ల బిల్డర్లకు ఆర్థిక భారం తగ్గుతుందని, ఢిల్లీ-ఎన్‌సీఆర్ రీజియన్‌లో భూమిని కొనుగోలు చేసి అపార్టుమెంట్లను నిర్మించడం భారమవుతుందని విశ్లేషించారు. ఇక హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభమైన ప్రాజెక్టులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చన్నారు. దీనివల్ల అధిక ఫ్లాట్ల సరఫరా సమస్య భాగ్యనగరంలో లేదని తెలిపారు.