అమెరికాలో ఒకేరోజు 10 వేల క‌రోనా కేసులు


అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో క‌రోనా ర‌క్క‌సి విజృంభిస్తున్న‌ది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 10 వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 54 వేల‌కు చేరింది. పాజిటివ్ కేసుల‌తోపాటే అమెరికాలో మృతుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతున్న‌ది.  మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే అక్క‌డ 150 మంది క‌రోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 775కు చేరింది. 


మిగ‌తా రాష్ట్రాల‌తో పోల్చితే న్యూయార్క్‌లో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ది. మంగ‌ళ‌వారం అమెరికా మొత్తంగా 150 మంది మృతిచెంద‌గా.. అందులో 53 మ‌ర‌ణాలు ఒక్క న్యూయార్క్‌లోనే న‌మోద‌య్యాయి. అమెరికాలో న‌మోదైన మొత్తం 775 మ‌ర‌ణాల్లో కూడా న్యూయార్క్‌లో న‌మోదైన మ‌ర‌ణాలే 201 ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసులు కూడా న్యూయార్క్‌లోనే ఎక్కువ‌గా ఉంది. మంగ‌ళ‌వాం నాటికి అమెరికా మొత్తంగా 54 వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వగా.. ఒక్క న్యూయార్క్‌లోనే 25 వేల కేసులు న‌మోద‌య్యాయి.